Thursday, November 19, 2015

మీనాక్షీ పంచరత్న స్తోత్రము

మీనాక్షీ పంచరత్న స్తోత్రము --- తెలుగు తాత్పర్యము.
ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాం
బింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతామ్ |
విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్
|| 1 ||
ఉదయించుచున్న వేలకోట్ల సూర్యులతో సమానమైనది కంకణములతో, హారములతో ప్రకాశించుచున్నది, దొండపండ్లవంటి పెదవులు కలది చిరునవ్వులొలుకు దంతముల కాంతికలది పీతాంబరము ధరించినది, బ్రహ్మ- విష్ణు- దేవేంద్రాదులచే సేవింపబడునది తత్త్వ స్వరూపిణి అయి శుభములను కలిగించునది అయి, దయా సముద్రము అయిన మీనాక్షీదేవికి నేను ఎప్పుడూ నమస్కరించుచున్నాను.
ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం
శింజన్నూపురకింకిణీమణిధరాం పద్మప్రభాభాసురామ్ |
సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్
|| 2 ||
ముత్యాల హారములు అలంకరించిన కిరీటముతో శోభించు చున్నది, నిండుచంద్రుని వంటి ముఖ కాంతి కలది, ఘల్లుమని అంటున్న అందెలు ధరించినది, పద్మములవంటి సౌందర్యము కలది, కోరికలు తీర్చునది హిమవంతుని కుమార్తె అయినది సరస్వతి, లక్ష్మీదేవులచే సేవింపబడుతూ దయా సముద్రము అయిన మీనాక్షీదేవికి నేను ఎప్పుడూ నమస్కరించుచున్నాను.
శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్జ్వలాం
శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్ |
శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్
|| 3 ||
శ్రీవిద్యా స్వరూపిణి, శివుని ఎడమభాగము నివసించునది హ్రీంకార మంత్రముతో ఉజ్జ్వలమైనది, శ్రీచక్రములో మధ్య బిందువు వద్ద నివసించునది ఐశ్వర్యవంతమైన సభకు అధిదేవత అయినది కుమారస్వామి వినాయకులకు కన్నతల్లి అయినది జగన్మోహిని అయి దయా సముద్రము అయిన మీనాక్షీదేవికి నేను ఎప్పుడూ నమస్కరించుచున్నాను.
శ్రీమత్సుందరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం
శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజామ్ |
వీణావేణుమృదంగవాద్యరసికాం నానావిధామంబికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్
|| 4 ||
సుందరేశ్వరుని భార్య అయినది, భయమును తొలగింప చేయునది, జ్ఞానము ఇచ్చునది నిర్మలమైనది, నల్లనికాంతి కలది, బ్రహ్మదేవునిచే ఆరాధింపబడునది, నారాయణుని సోదరి అయినది, వీణ- వేణు- మృదంగ వాద్యములను ఆస్వాదించునది, నానావిధములైన ఆడంబరములు కలది దయా సముద్రము అయిన మీనాక్షీదేవికి నేను ఎప్పుడూ నమస్కరించుచున్నాను.
నానాయోగిమునీంద్రహృత్సువసతీం నానార్థసిద్ధిప్రదాం
నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితామ్ |
నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్
|| 5||
అనేక యోగుల – మునీశ్వరుల హృదయమునందు నివసించునది, అనేక కార్యములు సిద్ధింప చేయునది, బహువిధ పుష్పములతో అలంకరింపబడిన రెండు పాదములు కలది, నారాయనునిచే పూజింపబడునది, నాదబ్రహ్మస్వరూపిణి అయినది శ్రేష్ఠమైన దానికంటే శ్రేష్ఠమైనది అనేక పరమార్ధముల తత్త్వము అయినది దయాసముద్రము అయిన మీనాక్షీదేవికి నేను ఎప్పుడూ నమస్కరించుచున్నాను.